వ్యవస్థాపకులు

వేదమూర్తి, తపోనిష్ఠ, యుగద్రష్ట పండిత
శ్రీ రామ శర్మ ఆచార్య గురుదేవుల సంక్షిప్త పరిచయం
అస్త్యుత్తరస్యాం దిశి దేవతాత్మా
హిమాలయో నామ నగాధి రాజః |
పూర్వాపరౌ వారి నిధీ వగాహ్యా
స్థితః పృథివ్యా ఇవ మానదండః ||


అని మహాకవి కాళిదాసు తన 'కుమార సంభవం' మహాకావ్యంలో హిమాలయాల ఔన్నత్యాన్ని విశేషంగా కొనియాడారు.అలాంటి హిమాలయాల పర్వత సానువులలో వేదాలు మారుమ్రోగాయి. మంత్రాలు ప్రతిధ్వనించాయి. సంస్కృతీ పుణ్యధార దశదిశలా వెలువడింది.

ఈ సంస్కృతీ ప్రవాహంలో ఒకప్పుడు సంపూర్ణ భారతదేశమందలి స్త్రీ, పురుషులు స్నానమాడి 'కాక పికమాయె, బక మాయె రాయంచా-(కాకి కోకిలగాను, కొంగ హంసగ మారుట) అనే పుణ్య ఫలానుభూతిని పొందారు. మనుష్యులలో దివ్యత్వం మొలకెత్తి, పెంపొంది దృఢమవుతుంది. ఈ దివ్య సంస్కృతిలో పెరిగి పెద్దవాడైన వారెవరైనా 'దేవతామూర్తిగా' అవకుండా వుండలేడన్నది-విశ్వమంతా గుర్తించిన ఒక పరమసత్యం. భారతజాతి తన మేధాశక్తితో ప్రకాశిస్తూ, ఆత్మ చైతన్యంతో వెల్లివిరిస్తున్నప్పుడు అత్యంత శక్తివంతంగా వుండేది. ఈ జాతిలో అత్యంత శక్తివంతమైన, బలిష్టమైన వ్యక్తిత్వాలు ఆవిర్భవించాయి. అప్పటి ఆనాటి మానవులలో దైవత్వం వెల్లివిరిస్తే భూమిపై స్వర్గానుభూతి కనిపించేది. సంస్కృతీ పుణ్య ప్రవాహం యొక్క పవిత్రతను గ్రహించుకునే సమయంలో భారతదేశం స్వర్ణ యుగాన్ని చూసింది, అనుభవించింది కూడా. ఆ రోజులలో పట్టిందల్లా బంగారంగా, ముట్టిందల్లా ముత్యంగా మారేవి. మన దేశంలో ఈ సామర్థ్యం, ప్రజలు - దైవ సంస్కృతీ నియమాలను పాటిస్తున్నంత కాలం నిలిచి వున్నది. కానీ అమూల్యమైన ఈ సంస్కృతిని ఎప్పుడైతే నిర్లక్ష్యం చేశారో, నియమాలను ఉల్లంఘించారో అప్పుడే అద్భుతమైన ఈ సంస్కృతీ ప్రవాహం మలిన పడిపోయింది. మలినాలు పెరగటంతో తేజస్సు క్షీణించడం మొదలైంది. దాంతో గత కొన్ని వేల సంవత్సరాలుగా భారతదేశం మిక్కిలి బలహీనపడి, ప్రజలు దీనంగా, హీనంగా జీవిస్తూ వుండటానికిదే కారణం. కానీ సూర్యాస్తమయం అయిపోయింది. సూర్యోదయపు జిలుగు వెలుగులు ప్రపంచమంతా పరుచుకుంటున్నాయి. హిమాలయాల్లో తపస్సాధన యొక్క తేజస్సు మరల వ్యాపించింది. వేదాల సారం, సాధనాశక్తుల ప్రతిరూపంగా మాత గాయత్రి తిరిగి అవతరించడం జరిగింధి.

పరమ పూజ్య గురుదేవులు పండిత శ్రీరామ శర్మ ఆచార్య రూపంలో సంస్కృతీ పుణ్య ప్రవాహంలో తిరిగి పవిత్రత దిగివచ్చింది. సంస్కృతీ ధారకు నూతన జీవితం లభించింది.

ప్రఙ్ఞావతారులైన పరమ పూజ్య పండిత శ్రీరామ శర్మ ఆచార్య గురుదేవులు ఉత్తరప్రదేశ్, ఆగ్రా జిల్లాలోని ఆవల్ఖేడా అనే గ్రామంలో 1911 సెప్టెంబర్ 20వ తేదీన జన్మించారు. 10 సం||ల బాల శ్రీరామునికి, తండ్రి గారైన పండిత రూప్ కిశోర్ గారు బ్రహ్మర్షితుల్యులైన శ్రీ మదన మోహన్ మాలవ్యా గారి ద్వారా ఉపనయన సంస్కారం చేయించారు.

జననము: సెప్టెంబరు 20, 1911, ఆవల్ఖేడ్, ఆగ్రా జిల్లా, ఉత్తరప్రదేశ్
తండ్రి: పండిత రూప్ కిశోర్ శర్మ గారు
తల్లి: దానకున్వరీ దేవీ


విద్య: గవర్నమెంట్ స్కూల్ లోఐదవ తరగతి వరకు, తండ్రి దగ్గర నుంచి రామాయణము, మహాభారతము, భాగవతము.

యఙ్ఞోపవీత సంస్కారము: ఎనిమిదవ ఏట శ్రీ మదన మోహన్ మాలవ్యా గారితో, బెనారస్ లో దాదాగురుదేవుల సాక్షాత్కారము

అఖండజ్యోతి వెలిగించుట: 1926 వసంత పంచమి నాడు

గాయత్రీ మహామంత్ర పురశ్చరణ: 15వ ఏట నుంచి 39వ సంవత్సరము వరకు, అంటే 24 సంవత్సరాలలో 24 గాయత్రీ పునశ్చరణలు చేశారు.

భగవతీదేవితో వివాహం: 1945, ఫిబ్రవరి 18

ప్రధమ సహస్రకుండీ యఙ్ఞము: 1953

సహస్ర కుండీ యఙ్ఞ పూర్ణాహుతి ఫలితంగా గాయత్రీ పరివార్ ఆవిర్భావము: 1958

విదాయి సమారోహము-మధుర తపోభూమిని వదిలి హరిద్వార్ వెళ్ళుట: 20-6-1971

ప్రాణ ప్రత్యావర్తన శిబిరాలు: 1972-73

సూక్ష్మీకరణ సాధన: 1984 నుంచి 1986 వసంతపంచమి వరకు

గాయత్రీ జయంతి, మహా ప్రయాణము స్థూల దేహ త్యాగము: 1991, జూన్ 2

శ్రీ మాలవ్యాజీ సహజంగానే గొప్ప ఋషి. మహోన్నత స్థాయి సాధకులు. వారు బాలునిలో దాగి వున్న మహాసాధకుణ్ణి గుర్తించారు. వారు గాయత్రీ దీక్షనిస్తూ శ్రీరామునితో – ‘యఙ్ఞోపవీతంలో ఉన్న 3 పేటలుగా గాయత్రీ యొక్క 3 పాదాలనీ, 9 దారాలు గాయత్రీ మంత్రములోని 9 శబ్దాలనీ - ఇది బ్రాహ్మణులకు కామధేనువు కనుక రోజుకు 5 మాలలు తప్పనిసరిగా చేయమనీ' వివరించారు.

మహాత్ముడైన శ్రీ మాలవ్యా గారి ఈ ఉపదేశం బాలుని యొక్క మనసులో తీవ్రంగా నాటుకున్నది.'యావజ్జీవితం దేవ సంస్కృతి ఎడల నిష్ఠగల్గి ఉంటానని - గాయత్రీ ఉపాసన చేస్తాననీ దీక్ష బూనారు. క్రమం తప్పకుండా గాయత్రీ సాధన కొనసాగిస్తున్నారు. ఆ రోజు వసంతపంచమి. బ్రాహ్మీ ముహూర్తంలో సాధనలో కూర్చున్నారు. ఆ దివ్య ముహూర్తంలో అనేక జన్మలుగా తనకు మార్గదర్శకులైన దేవాత్మ శ్రీ సర్వేశ్వరానందుల(దాదా గురుదేవులు) సాక్షాత్కారం లభించింది. వారు శ్రీరామునికి సమాధి స్థితిని కల్పించి అందులో - గత జన్మలలో 'అతి ముఖ్యమైన జన్మలను' అప్పుడు తను చేసిన లోక కళ్యాణ కార్యక్రమాలను అతి స్పష్టంగా దర్శింపచేశారు. ఈ జన్మలో తన రాకకు కారణమైన క్రియాకలాపాలను, సరిదిద్దవలసిన అనేక ప్రణాళికలను, (అపక్వంగా మిగిలినవి) ఈ కాలంలో మొలకెత్తవలసిన ఋషి పరంపర విశిష్ట బీజారోహణలను, రాబోయే కాలంలో భారతదేశాన్ని జగద్గురు స్థాయికి లేవనెత్తవలసిన 'గోవర్ధనగిరి ప్రక్రియను' గుర్తించారు బాల శ్రీరాముడు.

ఆ పరమ గురు చరణాలకు తమ సంపూర్ణ జీవితాన్ని దత్తత చేశారు. నాటి నుంచీ 'వసంత పంచమి' తిథినే గురుదేవుల జన్మదినంగా జరుపుతారు. దాదా గురుదేవుల ఆదేశానుసారం ప్రచండ తపస్సుతో విశ్వ స్థాయిలో అద్భుతమైన ప్రణాళికలను సాధించారు.

భౌతిక విఙ్ఞానానికి పాశ్చాత్య దేశాలు ఏ విధంగా ఆయువుపట్టో, అదే విధంగా ఆధ్యాత్మిక విఙ్ఞానానికి భారతదేశం, అందులోనూ ముఖ్యంగా హిమాలయ క్షేత్రం అతి ముఖ్యమైనది. అనేక మంది శాస్త్రవేత్తల ప్రయోగ ఫలితాలు ఒక శాస్త్రఙ్ఞుని మనోభూమిలో 'ఒక వైఙ్ఞానిక సిద్ధాంతంగా' లేక ఒక నియమంగా రూపొందుతుంది. అదే విధంగా అనేక మంది మహనీయులు చేతనత్వము మీద జరుపబడిన ప్రయోగాలు కొంతమంది విశిష్ట వ్యక్తుల ద్వారా ఆధ్యాత్మిక కేంద్రాలుగా లేక గురుపరంపరగా, ఆధ్యాత్మిక నియమావళి వారిదైన విశిష్ట పంథాగా రూపొందుతుంది. కాని, వీటన్నింటి వెనుక సృష్టి, స్థితి, లయ లేక బ్రహ్మ, విష్ణు, శివ శక్తి కేంద్రాలుగా ఒకే ఒక్క గురుసత్తా రూపుదాలుస్తుంది. దానికే మనం

గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః అంటాము.

ఈ Three in one చేతనత్వం - తనను తాను భూః, భువః, స్వః లోకాలకు అంకితం చేసుకుంటుంది లేక దత్తమౌతుంది కనుక దీనిని దత్తావతారమంటారు. ఈ 'సత్తాని ' శక్తి పరంగా చెప్పాల్సి వచ్చినపుడు -బ్రాహ్మీ-వైష్ణవీ-శాంభవీల యొక్క కలయిక గాయత్రీగా చెప్పటం జరిగింది.

ఈ గాయత్రీ సాధనను గురుదేవులు 24 సంవత్సరముల పాటు 24 మహా పురశ్చరణలుగా చేసి పరాశక్తి యొక్క ప్రతిరూపంగా ప్రకటీకరించుకున్నారు. వారు తమ మార్గదర్శకులైన శ్రీ సర్వేశ్వరానంద స్వామి వారి ఆదేశానుసారం 1984 సంవత్సరంలో సూక్ష్మీకరణ సాధన చేయటం జరిగింది. గురుదేవులు సాధనతో పాటు తమ లక్ష్యాలను కార్యాన్వితం చేయుటకు వేర్వేరు సమయాలలో వేర్వేరు ప్రణాళికలను అమలు చేయటం జరిగింది. అందులో మొట్టమొదటగా వారు 1958 సంవత్సరములో చేసిన సహస్రకుండీ పూర్ణాహుతిలో భాగంగా ఆవిర్భవించిన ప్రథమ పుష్పం-గాయత్రీ పరివార్.


1.గాయత్రీ పరివార్:

కేవలం గాయత్రీ ఉపాసకులను మాత్రమే గాయత్రీ పరివార్ అనలేము. ఎవరైనా సరే తమ ప్రఙ్ఞను ఉపయోగించి, నిష్ఠతో శ్రద్ధాపూర్వకమైన రీతిలో లక్ష్య దృష్టి గల సమూహం కూడా గాయత్రీ పరివార్గానే గుర్తించబడతారు. దీనినే భగవద్గీత 17వ అధ్యాయంలో 'యో యః శ్రద్ధః స ఏవసః' అన్నదే నిజమైన గాయత్రీ పరివార్. మనో, వాక్కాయ, కర్మల ఏకీకరణతో అంటే త్రికరణ శుద్ధితో ఆచరణ ప్రధానమైన సమూహమే గాయత్రీ పరివార్.


2. యుగ నిర్మాణ యోజన :

'యుగమును ' మార్చుట అనగా ఆలోచనా విధానాన్ని మార్చి వేయుట. త్రికరణశుద్ధిగా పనిచేయగల గాయత్రీ పరివార్ వ్యక్తి మాత్రమే యుగ నిర్మాణ యోజనలో పాలుపంచుకోగలడు. స్థూల, సూక్ష్మ, కారణ జగత్తులలో సంయమనమును పాటించగల వ్యక్తి మాత్రమే మహర్లోక ప్రఙ్ఞను లేక ఙ్ఞాన గంగను పృథ్వి పైకి తేగలడు. గురుదేవుల క్రాంతి ధర్మీ సాహిత్య అధ్యయనము-ప్రచారము కూడా ఈనాటి ఈ అత్యవసర పరిస్థితులలో గాయత్రీ పరివార్ చేయవలసిన ప్రధాన కర్తవ్యం. ఈ సాహిత్య విషయంలో గురుదేవులు 'మేరా సామర్థ్థ మేరే సాహిత్య మే ఛిపీ రహీ హై' అంటారు. అందుచేత ఈ స్థాయిలో చేసే పని యుగ నిర్మాణ యోజన అవుతుంది కనుక గాయత్రీ పరివార్ సభ్యులందరూ యుద్ధ ప్రాతిపదిక మీద ఈ క్రాంతి ధర్మీ సాహిత్య అధ్యయన కేంద్రాలను స్థాపించి ప్రణాళికాబద్ధంగా ఙ్ఞాన గంగను పృథ్విమీదకు దింపే ప్రయత్నం చెయ్యాలి. వారే అసలైన గాయత్రీ పరివార్ కార్యకర్తలు. గురుదేవుల అనుంగు శిష్యులు.


నవయుగ నిర్మాతగా గురుదేవులు సాధించినవి :

గాయత్రీ తీర్థము - దేవ మానవులకు తపోభూమి.

బ్రహ్మవర్చస్ శోధ సంస్థాన్ - వైఙ్ఞానిక ఆధ్యాత్మిక పరిశోధనాలయం

గాయత్రీ తపోభూమి - మధురలో స్థాపించారు

అఖండ జ్యోతి సంస్థానము - ఘియామండి మథురలో

దేవ సంస్కృతి విశ్వవిద్యాలయము - హరిద్వార్లో


సూక్ష్మీకరణ సాధన ద్వారా -

1.విశ్వకుండలినీ జాగరణ

2.పంచవీరభద్రసాధన చేశారు

3.నవయుగ అవతరణకు కావలసిన బాటలు వేశారు


3. గాయత్రీ తీర్థం - శాంతికుంజ్ :

గంగ ఒడిలో, హిమాలయాల ఛాయలో హరిద్వార్కు 6కి.మీ. దూరంలో గాయత్రీ తీర్థం, శాంతికుంజ్ స్థాపించబడింది. గురుదేవుల, మాతాజీల మహత్తర తపో సాధనతో జాగృతమైన ప్రాణశక్తి గల్గిన ఈ తీర్థం-లక్షల గాయత్రీ సాధకులకు ఆలయం.

1971వ సంవత్సరంలో స్థాపితమైన శాంతికుంజ్ ఒక ఆధ్యాత్మిక శానిటోరియంగా వికసింపజేయబడింది.శరీరాన్ని, మనస్సును, అంతఃకరణను సమున్నతం చేయటానికి అనుకూలమైన వాతావరణం, మార్గదర్శనం, శక్తి ఇక్కడ పుష్కలంగా ఉన్నది. ఇక్కడ భవ్యమైన గాయత్రీ దేవాలయం, సప్తర్షుల విగ్రహాలు ప్రతిష్ఠించబడ్డాయి. 'దారి తప్పిన దేవత ' మందిరం ఉన్నది. ఇక్కడ నిర్ణీతమైన తేదీలలో సాధనా శిబిరాలు జరుగుతూ వుంటాయి. ఈ శిబిరాలలో పాల్గొని నూతన ప్రేరణను, దివ్యమైన ప్రాణశక్తిని వరాలుగా పొంది వెళ్లవచ్చును.

1926వ సంవత్సరంలో అఖండ దీపం స్థాపించబడింది. ఈ అఖండ దీప సమ్ముఖంలో 2400 కోట్లకు మించిన గాయత్రీ జపం జరిగింది. దీనిని దర్శించినంత మాత్రాన దివ్యప్రేరణ, శక్తిని అందరూ పొందుతారు.

ఆశ్రమంలోని విరాట్ యఙ్ఞశాలలో ప్రతి నిత్యం 27 కుండీలతో యఙ్ఞం-దాంతో పాటు పుంసవనం, నామకరణం, విద్యారంభం, ఉపనయనం, వివాహం, శ్రాద్ధకర్మ మొ|| భారతీయ సంస్కారములన్నీ జరుగుతాయి.

శాంతికుంజ్ ఆవరణలో భవ్యమైన ఓషధీ ఉధ్యానవనంలో 300 పైగా దుర్లభమైన, ఉపయోగకరమైన వనౌషధీ మొక్కలను పెంచుతున్నారు. అంతేకాక వివిధ గ్రహ, నక్షత్రాల కోసం జ్యోతిష శాస్త్ర సమ్మతమైన దివ్య ఓషధులుండటం ఈ ఉద్యానవనము యొక్క విశిష్ఠత. 12 ఓషధులతొ తయారుచేసిన ప్రఙ్ఞాపేయము-'టీ ' కి బదులుగా పెద్ద ఎత్తున దేశ విదేశాలలో వాడుతున్నారు. దుర్వ్యసనాల నుండి వ్యక్తులకు ఈ ప్రఙ్ఞాపేయము విముక్తినిస్తుంది.

ఇక్కడ ఏర్పాటు చేసిన విశాలమైన భోజనాలయంలో ప్రతీరోజూ 5000 మంది దర్శనార్థులు భోజన ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. పేదరిక నిర్మూలనలో భాగంగా-చిన్న కుటీర పరిశ్రమల ద్వారా సంపాదన పొందేందుకై ఇక్కడ ఉచితంగా శిక్షణనిస్తున్నారు. ప్రత్యామ్నాయ ఇంధన వనరులుగా సౌరశక్తిని సమీకరించే ఉపకరణాలను పవనశక్తికి సమీకరించే ఉపకరణాలను ఇక్కడ స్థాపించారు. గ్రామీణ ప్రజలకు తగిన శిక్షణనిస్తున్నారు.

వ్యక్తిత్వంలో ఉత్కృష్టతను నింపుకొని ప్రభావశాలురుగా మారటానికి 'సంజీవనీ సాధనా శిబిరాలు ' ప్రతీనెలా 1-9, 11-19, 21-29 తేదీలలో నిర్వహిస్తున్నారు. అంతేకాక నెల రోజుల పాటు జరిగే 'యుగశిల్పి సాధనా' శిబిరాలు భావనాశీలురైన కార్యకర్తలు నైతిక, భౌతిక, సామాజిక విప్లవం కొరకు పరిపూర్న శిక్షణ పొందటానికి ప్రతీ నెలా పాల్గొంటారు. ఐదు రోజుల మౌన అంతః ఊర్జా జాగరణ సత్రం- ఇది ఆంతరిక శక్తిని మేలుకొలిపే సాధన ఆశ్వీయుజ మాసం నుండీ చైత్ర నవరాత్రుల వరకు జరుగుతాయి. నైతిక, భౌతిక, వ్యక్తిత్వ సంస్కరణ నిమిత్తం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అధికారులకు 5 రోజుల పాటు శిక్షణా శిబిరాలు నిర్వహిస్తారు.

ఇక్కడ హిమాలయాల దివ్య విరాట్ ప్రతిరూపం 60 అడుగుల వెడల్పు, 15 అడుగుల ఎత్తు గల కొలతలతో నిర్మించబడినది. ఈ ప్రతి రూపం ఎదుట కూర్చుని ధ్యానం, జపం చేయుటలో అలౌకిక ఆనందం కలుగుతుంది. దీని ప్రక్కనే ఉన్న 'దేవ సంస్కృతి దిగ్దర్శన్'లో మిషన్ ప్రస్తుత స్వరూపం, భవిష్యత్ యోజనల చిత్రణ చేయబడినది.

శాంతికుంజ్ మార్గదర్శకంలో 'అఖండ జ్యోతి ' హిందీ మాసపత్రిక, గుజరాతీ-మరాఠీ-ఒరియా-బెంగాలి-తమిళం-తెలుగు-ఇంగ్లీషు భాషలలో ప్రచురింపబడుతున్నాయి. పాఠకుల సంఖ్య మొత్తం 50 లక్షలుంటారు.

గురుదేవులు గాయత్రీ మహావిద్య, జీవించే కళ, వ్యక్తిగత, కుటుంబ, సమాజ నిర్మాణం వంటి విషయాలపై సుమారు 3000కు పైగా గ్రంధాలు హిందీ భాషలో రచించారు. ఈ మొత్తం సాహిత్యాన్ని 108 వాఙ్మయాల సంపుటాలుగా ప్రచురించుచున్నారు.

పరమ పూజ్య గురుదేవులకు 1964లో జరిగిన సర్వమత సభలో నాటి పంజాబ్ హోం మంత్రి శ్రీ మోహన్లాల్ శర్మ 'లైట్ ఆఫ్ ఇండియా' అనే బిరుదునిచ్చారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తామ్రపత్రం, స్వాతంత్ర్య సంగ్రామ సేనాని సన్మాన పత్రం ప్రధానం చేసి గౌరవించింది. 27-6-1991 దా||శంకర్ దయాళ్ శర్మ(ఉప రాష్ట్రపతి) పరమపూజ్య గురుదేవుల గౌరవార్థం రూపాయి బిళ్ళను విడుదల చేశారు. ఇదంతా భౌతిక పక్షంగా శాంతికుంజ్లో జరుగుతున్న కార్యక్రమాలు.

పూజ్యగురుదేవులు - మహర్షుల ద్వారా దింపబడిన 'ఙ్ఞానగంగధార 'ను హిమాలయాలలోని ఉచ్చ శిఖరాల నుంచీ హరిద్వార్ మైదానపు ప్రాంతం వరకు తీసుకువచ్చే ప్రయత్నమే శాంతికుంజ్ నిర్మాణం. అనగా ప్రఙ్ఞామయ స్థితిలో ఉన్న వ్యక్తుల సమూహము. సూక్ష్మలోకాలలో ఉన్న మహర్షుల చేతనత్వాలతో సంపర్క మేర్పరచుకొని వారి క్రియాకలాపాలను బీజరూపంలోనేకాక, అనంతమైన శాంతినిచ్చే దృఢ మనోభూమి కల్గిన ప్రఙ్ఞాపుత్రుల విశిష్ఠ పరిశోధనా కేంద్రంగా దీనిని మలిచారు.


4. బ్రహ్మ వర్చస్ శోథ్ సంస్థాన్ :

పంచ కర్మేంద్రియాలు, పంచ ఙ్ఞానేంద్రియాలు, పంచ ప్రాణాలు, పంచతన్మాత్రలు, మనో, బుద్ధి, చిత్త, అహంకారాలు - ఈ 24 గురుసత్తా అధీనంలోకి వెళ్ళిపోయిన 24 శక్తి కేంద్రాలుగా పనిచేయుటయే బ్రహ్మ వర్చస్ అనే సంస్థ. అనసూయ, అత్రిపుత్రుడైన దత్తుడు తన 24 గురువుల గురించి - గురుగీతలో చేసిన ప్రస్థావనే ఈ 24 శక్తి రూపాలు. వీటికి ఉన్న వర్ణములు, మంత్రములు, యంత్రములు, స్వరూపములను అర్థం చేసుకొని తన శరీరమును విరాట్ శరీరములో కలపటమే ముఖ్య ఉద్ధేశ్యముగా గల వ్యక్తుల సమూహ నిర్మాణమే ఈ బ్రహ్మ వర్చస్ సంస్థానం యొక్క ప్రధాన ఉద్ధేశ్యం.

ఆధ్యాత్మికతను వైఙ్ఞానికంగా ప్రతిపాదిస్తున్న బ్రహ్మ వర్చస్ హిమాలయాలలో తపస్సు చేస్తున్న ఋషి సత్తాల మహా సంకల్పానికి మూర్తి రూపమే ఈ బ్రహ్మ వర్చస్ శోథ్ సంస్థాన్. ఆధ్యాత్మ విద్యలో మహా వైఙ్ఞానికులైన శ్రీ గురుదేవులు ఈ మహా సంస్థ స్థాపన ద్వారా అసాధ్యాన్ని, సుసాధ్యం చేసి చూపారు. ఇందులో అనేక ఆధ్యాత్మిక రహస్యాలు దాగివున్నాయి.

కణాదుడు, అధర్వణుడు లాంటి ప్రాచీన మహా వైఙ్ఞానిక ఋషి పరంపరకు బీజారోపణ బ్రహ్మ వర్చస్ శోథ్ సంస్థాన్. గురుదేవులిలా వ్రాశారు. "మా భావి తపశ్చర్యకు మరో లక్ష్యమున్నది. ఆధ్యాత్మికతలోని విఙ్ఞాన విభాగం చనిపోయిన, లోపించిన పరిస్థితుల నుండి వెలికితీయడం, దాని ప్రభావాన్ని, ఉపయోగాన్ని సామాన్య ప్రజలకి అందేటట్లు చేయటం, ఆస్థిక, ధార్మిక, ఆధ్యాత్మిక సిధ్ధంతాలు వాస్తవాలని మనం శాస్త్ర విఙ్ఞానమాధారంగా నిరూపించటం".


ఆయన ప్రారంభించిన సప్త విప్లవాలు :

ఆస్తికత సంవర్ధన

విద్యా విస్తరణ

అందరికీ ఆరోగ్యము

స్వయం పోషకత్వము

పర్యావరణ సంతులనము

మహిళా జాగరణ

వ్యసనాల, దురాచారాల నిర్మూలన


శోధ్ సంస్థాన్ స్వరూపం :

గంగ ఒడ్డున గల ఈ సంస్థలో 4 విభాగాలున్నాయి.

1. ఆదిమాత గాయత్రీ యొక్క 24 శక్తి ధారల ఆలయం

2. వైఙ్ఞానిక ఆధ్యాత్మికతపై పరిశోధనాలయం

3. రిఫరెన్స్ గ్రంధాల గ్రంధాలయం

4. సమర్పిత శాస్త్రవేత్తల సముదాయం.


1. భగవతి గాయత్రి 24 శక్తి ధారల ఆలయం

గాయత్రీ మహామంత్రంలోని 24 అక్షరాలు 24 విధాల మహా సాధనా విధాన - విఙ్ఞానం ఇమిడి వుంది.

1. ఆద్యశక్తి

2. బ్రాహ్మీ

3. వైష్ణవి

4. శాంభవి

5. వేదమాత

6. దేవమాత

7. విశ్వమాత

8. ఋతుంభర

9. మందాకిని

10. అజప

11. బుద్ధి

12. సిద్ధి

ఈ పన్నెండు వైదిక సాధనలకు మార్గదర్శనం చేస్తాయి.


1. సావిత్రి

2. సరస్వతి

3. లక్ష్మి

4. దుర్గ

5. కుండలిని

6. ప్రాణాగ్ని

7. భవానీ

8. భువనేశ్వరి

9. అన్నపూర్ణ

10.మహామాయ

11.పయశ్విని

12.త్రిపుర

ఈ పన్నెండు గాయత్రీ తాంత్రిక సాధనల అధిష్టాన దేవతలు.


గురుదేవులు 24 శక్తుల భవ్య ఆలయాలని నిర్మించి స్వయంగా విగ్రహ ప్రతిష్ట చేశారు. ప్రతీ ఆలయానికి ఇరువైపులా ఆ మహాశక్తి ఉపాసనకు ప్రయోగించే యంత్ర, మంత్రాలను, ప్రయోగవిధి, ఫలశ్రుతి -వీటి సాంకేతిక వివరణ ఇవ్వబడినది. మూర్తి విఙ్ఞానం, మంత్ర ఙ్ఞానం, యంత్ర విఙ్ఞానముల సిద్ధాంతాల సమగ్ర సమ్మేళనం దీనిలో వున్నది.


2. వైఙ్ఞానిక ఆధ్యాత్మ పరిశోధనాలయం :

ఆధునిక కంప్యూటర్లు గల్గిన ఈ పరిశోధనాలయంలో మూడు విభాగాలున్నాయి.

(ఎ) యఙ్ఞ చికిత్స పరిశోధనాలయం

(బి) ఆధ్యాత్మిక సాధనల ఫలితంగా శరీరంపై, ప్రాణంపై ఇంకా సంపూర్ణ జీవితంపై ప్రసరించే ప్రభావాలను కొలిచే పరిశోధనాలయం.

(సి) వనమూలికల పరిశోధనాలయం. దానికి అనుబంధంగా వనమూలికల ఉద్యానవనం.


మానవ శరీరం చుట్టూ ఉండే కాంతి వలయాలను కొలిచే యంత్రాలు, శరీరంలోని జీవనశక్తినీ, వివిధ రసాయనాలను విశ్లేషణ చేసే యంత్రాలు - కంప్యూటర్లు ఇందులో ఉన్నాయి.


3. రిఫరెన్స్ గ్రంధాలు :

ఇక్కడ వివిధ మతాలపై సాహిత్యం ఉన్నది. తంత్రం, జ్యోతిష్యం, పాశ్చాత్య తత్త్వశాస్త్రం, చరిత్ర, ఆయుర్వేదం, ఆధునిక చికిత్సా విఙ్ఞానం, రసాయన, భౌతిక శాస్త్రములు, ఖగోళ శాస్త్రం మున్నగు శాస్త్రాలపై సుమారు 50,000 రిఫరెన్స్ పుస్తకాలున్నాయి. దుర్లభమైన అనేక తాళపత్ర గ్రంధాలు, 100 ఎన్సైక్లోపీడియాలు, విశ్వవిఖ్యాతి పొందిన 300 వార, పక్ష, మాస పత్రికలు వస్తాయి.


4. సమర్పిత శాస్త్రవేత్తల సముదాయం :

మనిషి వ్యక్తిత్వంపై ఆధ్యాత్మిక సాధనల ప్రభావం ఎలా ఉంటుందన్న విషయంపై వైఙ్ఞానికులు, మహామనీషులు సుమారు 40 మంది పరిశోధనలు జరుపుతున్నారు. వీరంతా M.Sc., Ph.D., M.D., D.M. మొదలగు ఉన్నత డిగ్రీలు పొందినవారే. వీరంతా గురుదేవుల ఆదర్శాలకు అంకితమై స్వచ్ఛందంగా పనిచేస్తున్నారు. వీరంతా సమర్పిత శాస్త్రవేత్తల సముదాయమే.


5. దేవ సంస్కృతి విశ్వవిద్యాలయం :

యుగ ఋషి సమాధి చేతనలో కన్న కలలను గురుంచి ఇలా తెలిపారు. 'విశ్వవిద్యాలయాలు లేత మనస్సులలో నిజమైన జ్ఞాన పుష్పాలు పూయించాలి. అవి ఎందరెందరో మహనీయులను, ప్రతిభావంతులను, మహితాత్ములను, ప్రపంచ ఖ్యాతి పొందిన విశ్వమానవులను నిర్మాణం చేశాయి. నలంద, తక్షశిల లాంటి విశ్వవిద్యాలయాన్ని స్థాపించాలన్నది నా స్వప్నం. ఆ విద్యాలయములలో మనిషికి దివ్యాత్వాన్ని ప్రసాదించే నైతిక జీవిత విధానాలను బోధించాలి. వేదఋషులు, మునులు, ద్రష్టలూ తమ దివ్యదృష్టితో, తమ తపశ్శక్తితో, తమ ఆధ్యాత్మిక దర్శనంతో సంస్థాపన చేసిన దేవ సంస్కృతిని ఆ విశ్వవిద్యాలయం పునరుద్ధరించాలి '.

యుగ ఋషి కన్న కలలను శాంతికుంజ్ సాకారం చేసింది. శాంతికుంజ్ హరిద్వార్ సమీపంలో అందాలొలికే 10 లక్షల చదరపు అడుగుల స్థలం తీసుకొన్నారు. 23-5-1999న భూమి పూజ చేశారు. అనేక మంది సాధుసంత్, విద్యావేత్తలు, రాజనీతిఙ్ఞులు ఈ కార్యక్రమానికి వచ్చారు. వారి అధ్యాత్మిక వారసులు డా. ప్రణవ్ పాండ్యాగారు వారి కలలకు సాకార రూపాన్ని ఇచ్చారు. దేవ సంస్కృతి విశ్వవిద్యాలయాన్ని అత్యంత సుందరంగా, అతి ఉన్నత విద్యా, సంస్కృతి సంస్కారాలను ఇవ్వగలిగిన విశ్వవిద్యాలయంగా రూపొందించారు.


ఆశయాదర్శాలు :

దేవ సంస్కృతి అధ్యయనం, ప్రసారం, సైన్స్, ఫిలాసఫీ, రెలీజియన్ మొదలగు దేవ సంస్కృతి ఙ్ఞాన ధారలపై ఆధారితమైన పాఠ్య ప్రణాళికల ప్రకారం శిక్షణ. ఆయా ఙ్ఞానధారలను ఆధునిక యుగానికి అన్వయించటం పై పరిశోధన.


సంస్థాపకులు :

గాయత్రీ తపోభూమి - మథుర

అఖండ జ్యోతి సంస్థాన్ - మథుర

అఖిల విశ్వ గాయత్రీ పరివార్ - హరిద్వార్

గాయత్రీ తీర్థ్, శాంతికుంజ్ - హరిద్వార్

బ్రహ్మవర్చస్ శోధ్ సంస్థాన్ - హరిద్వార్

దేవ సంస్కృతి విశ్వ విద్యాలయము - హరిద్వార్


జ్యోతిష్యం, ఆయుర్వేదం, మంత్ర విఙ్ఞానం, యోగ విఙ్ఞానం, మనో విఙ్ఞానం మొదలగు విషయాల ఙ్ఞానధారలలో శిక్షణ. ఈ విశ్వ విద్యాలయంలోని కోర్సుల వివరాలు :

1. భారతీయ సంస్కృతి – M.A.

2. మానవీయ చేతన, యోగ విఙ్ఞానం - M.A. / M.Sc.

3. మానవీయ చేతన, యోగ విఙ్ఞానం - P.G. Diploma

4. యోగ విఙ్ఞానం - Certificate Course

5. మత విఙ్ఞానం - Certificate Course

6. సమగ్ర ఆరోగ్య యాజమాన్యం - Certificate Course

7. వైఙ్ఞానిక విఙ్ఞానం - M.A. / M.Sc.

8. గ్రామీణ యాజమాన్యం – Certificate Course

9. Bio Informatics - P.G. Diploma

10. బయో - మెడికల్ సిస్టం - P.G. Diploma

11. ప్రొఫీషియన్సీ ఇన్ ఇంగ్లీషు - P.G. Diploma


ఈ విశ్వవిద్యాలయంలో విద్యార్థుల నుండి ట్యూషన్ ఫీజు తీసుకోరు. వసతి, విద్యుచ్చక్తి, గ్రంధాలయం, పరిశోధనాలయం, అధ్యయన, పర్యటన, నివేదిక తయారీ వంటి వాటి కోసం విద్యార్థులు కనీస ఖర్చులు భరిస్తారు. శ్రీ వేదమాత గాయత్రీ ట్రస్ట్ ఆర్థిక సహాయంతో ఈ సంస్థ నడుస్తున్నది.


వారి భవిష్యత్ కథనములు :

రాబోయే కాలములో వినాశనము కాదు, సృజన జరుగుతుంది

పృథ్విపై స్వర్గావతరణ జరుగుట తధ్యము

మనిషిలో దైవత్వ ఆవిర్భావము తధ్యము

21వ శతాబ్ది - ఉజ్వల భవిష్యత్తు

నవయుగం - నారీ యుగం

మనం మారితే - యుగం మారుతుంది


నేడు సమాజంలో మరియు ప్రపంచంలో ఉన్న అనేక సమస్యలకు గల ఏకైక సమాధానము ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత అంటే జీవించే కళ, జీవితము నుండి పారిపోవటము కాదు. ఈ జీవించే కళ నేర్చుకోవటానికి గాయత్రీ మంత్రము మరియు గాయత్రీ యఙ్ఞము బ్రహ్మాస్త్రాలుగా పని చేస్తాయి. నవయుగ అవతరణ యొక్క సంభావనను నిజం చేస్తాయి. యుగ నిర్మాణము విచార క్రాంతి ద్వారానే సంభవము.

ఆచార్యశ్రీ, తన రీసెర్చ్ ద్వారా తెలుసుకున్న సిద్ధాంతాలను తమ జీవితంలో అమలుపరచుకుని మనకి ఆదర్శముగా చూపించారు. ఇవే సిద్ధాంతాలు మానవజాతిలోని ప్రతి ఒక్కరికీ వర్తిస్తాయని చాటి చెప్పారు.

శక్తి స్వరూపా వందనీయ మాత భగవతీ దేవీ శర్మ

పరమ పూజ్య గురుదేవుల జీవితము తెరిచిన పుస్తకము. ఆయన తన గురించి చాలా వ్రాయుట లేదా వేరే ఇతర మాధ్యమముల ద్వారా చెప్పించుట జరిగింది. కానీ ఇదంతా కూడా అసలు నిజంగా ఆయన ఎవరో, ఏ పని చేయుటకు పంపించబడ్డారో అనే విషయంలో మనకు తెలిసింది చాలా తక్కువ, తెలియందే చాలా ఎక్కువ. అనేక విషయాలను ఆయన కావాలనే గుప్తంగా ఉంచారు కానీ అపర అన్నపూర్ణాదేవిగా రూపుదాల్చిన పరమ వందనీయ మాతాజీ, ఆయన సహధర్మచారిణి మరియు పృధ్విపై ఆయన పాత్రను సంపూర్ణం చేసిన ఆమె జీవితము ఎల్లరకు ఆచరణీయము మరపురాని మధురగాథ.

ఆమె నడిపిన సామాన్య జీవితము మరియు ఆమె చెంతకు వచ్చిన పరిజనులపై ఆమె కురిపించిన మాతృ ప్రేమ కేవలము హిమపర్వతముపై కొన మాత్రమే. చాలా తక్కువ సహచరులు మాత్రమే ఆమె శక్తిస్వరూపమని ఎరుగుదురు.

శ్రీ జస్వంతరావు, రామప్యారీలనబడే బ్రాహ్మణ దంపతులకి అమ్మ ఆఖరి సంతానము. శ్రీ జస్వంతరావు, రామప్యారీలు నిష్ఠ కలిగిన సాధు దంపతులు. భగవతి జననానికి ముందు అమ్మ రామప్యారీకి ఎన్నో ఆధ్యాత్మిక అనుభూతులు వచ్చుచుండేవి. వాటిని ఆమె తన భర్తతో పంచుకుంటూ ఉండేవారు. ఈ దంపతులు మాతా భగవతీ యొక్క గొప్ప భక్తులు. వారి ఇంటి ప్రాంగణమంతా దుర్గా సప్తశతీ మరియు చాముండేశ్వరీ జపముతో మారుమ్రోగుతుండేది. జస్వంతరావు అత్యంత సరళ స్వభావము గల ఆధ్యాత్మిక ప్రకృతి కల వ్యక్తి. ఎన్నోసార్లు ఆయన జపము మరియు ప్రాణాయామము చేయుటకు కూర్చోని ఉండగా, మాతా భగవతీ బాలిక రూపంలో తన ఒడిలో కూర్చున్నట్లు అనుభూతి కలుగుతూ ఉండేది. భగవతీ సెప్టెంబరు 20, 1926 తేదీన జన్మించినది. ఇక్కడ మనం గుర్తుంచుకోవలసిన విషయమేమిటంటే గురుదేవులు అఖండ జ్యోతిని అదే రోజున ప్రజ్వలింపచేసారు. భగవతీ చిన్నది కావటంతో కుటుంబంలోని వారందరికీ ప్రియమైనది. ఒక రోజు జస్వంతరావు ఒడిలోనున్న తన కూతురిని తదేకంగా చూస్తుండగా, ప్రక్కింటావిడ వచ్చి ఇలా ప్రశ్నించింది, ' నీ కూతురిలోనున్న ఆ గొప్పదనమేమిటి అలా రెప్పార్పకుండా చూస్తున్నావు?' దానికి బదులుగా జస్వంతరావు, 'ఈ బాలిక చాలా అదృష్టవంతురాలు. ఈమె వేలాదిమందికి భోజనము పెడుతుంది. ఈమె అందరికీ వరాలిచ్చే మాతా భగవతీ ' అని చెప్పారు.

అమ్మలో గొప్ప అందము లేకపొయినా, అమె వ్యక్తిత్వంలో దేవీ ఆకర్షణ ఉండేది. అక్కచెల్లెళ్లు, అన్నదమ్ములు ఆమెను ప్రేమగా 'లాలీ' అని పిలిచేవారు. లాలీ నాలుగేళ్ళ వయస్సులో తల్లిని పోగొట్టుకుంది. అప్పటినుండి వదినగారి సంరక్షణలో పెరిగింది. చిన్నతనములో తనకి ఇష్టమైన ఆట శివోపాసన. పదకొండు, పన్నెండేళ్ళ వయస్సులోనే సాధనలో మునిగిపోయేది. సమాధిస్థితిలో ఆమె కబీరు, శ్రీ రామకృష్ణ పరమహంస జీవితాలు చూసేది. ఈ స్థితిలోనే తనకు, కబీరు పత్ని 'లోయి ' కి మరియు శ్రీ రామకృష్న్ణ పరమహంస సహధర్మచారిణి శారదామాతాకి ఎదో దగ్గర సంబంధమున్నదని గ్రహించింది.

శ్రీరూప్ కిశోర్ గారి పుత్రుడు శ్రీరాంతో 18 ఫిబ్రవరీ 1945 తేదీన ఆమె వివాహం నిరాడంబరంగా జరిగింది. పెళ్ళయిన తరువాత అఖండజ్యోతి సంస్థాన్లో ఆమె మాతాజీగా పరివర్తన చెందారు. అఖండజ్యోతి సంస్థాన్లో మొదటినుంచే ముగ్గురి బిడ్డలను, అఖండజ్యోతిని, సంస్థాన్కి వచ్చే పరిజనులను చూసుకోవలసిన బాధ్యత తీసుకున్నారు. ఆ తరువాత ఆమె గురుదేవుల అనేకరకాలైన పనులలో సహకరించవలసి వచ్చేది. వాటిల్లో ముఖ్యముగా అఖండ జ్యోతి పత్రికకు సంబంధించిన పని మరియు పరిజనులకు ఉత్తరాలు వ్రాయుట. ఇద్దరూ భిన్నమైన పనులలో నిమగ్నమై ఉండేవారు. కేవలము పరిజనులకు ఉత్తరాలు వ్రాయటం, వాటికి జవాబివ్వటము చేసేటప్పుడు మాత్రమే కలిసేవారు. ఈ సమయములోనే కుటుంబ విషయాలను గురించి చర్చించుకొనే అవకాశమొచ్చేది. కాలక్రమేణ ఆమె మృత్యుంజయ మరియు శైల కి జన్మనిచ్చారు. అది గాయత్రీ తపోభూమి నిర్మిస్తున్న రోజులు. భూమి కొనుగోలు తరువాత గురువుగారి చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు. అయినా గాయత్రీ తపోభూమి భవన నిర్మాణము మొదలు పెట్టాలి. ఇతరులను ధన సహాయము కోరటము గురువుగారి నియమాలకి విరుద్ధమని ఎరిగిన మాతాజీ, తన నగలన్నీ కట్టడాలకి ఇచ్చేశారు. ఈ సందర్భంలో గురువుగారు, స్త్రీ యొక్క అందం ఆభరణాలు మరియు ఖరీదైన వస్త్రాలలో కాక వ్యక్తిత్వంలో ఉంటుందని పేర్కొన్నారు. అప్పటినుండి మాతాజీ ఖరీదైన వస్త్రాలను ధరించటము మానేసారు.

ఇరవైనాలుగు గంటలు మాతాజీ ఉపాసన, సాధన మరియు ఆరాధనలోనే గడిపేవారు. తరువాతి సంవత్సరాలలో విపరీతముగా పెరుగుతున్న గాయత్రీ పరివారమును మరియు మిషన్ కార్యక్రమాలను చూసుకోవలసిన పెద్ద గురుతర బాధ్యత స్వీకరించారు. ధనవంతుల కుటుంబంలో పుట్టి, ధనవంతుల కుటుంబంలో ఇల్లాలు అయినప్పటికి, గురుదేవులతోపాటుగా, ఆయన కావాలని అవలంభించిన పేదరిక జీవితాన్ని పంచుకున్నారు. ఏనాడు కూడా ఆమె ఎత్తిపొడవటంగానీ, చిరాకు పడటముగానీ చేయలేదు. ఆమె జీవితాన్ని మనస్పూర్తిగా తన ఆరాధ్యుని చరణాలకు అర్పించారు. ఆమె ఎంతో గొప్ప సాధకురాలైనా, ఆచార్యశ్రీ గారి మొదటి శిష్యురాలిగానే ఉండిపోయారు, వంటగదిలో ఎప్పుడూ సరిపోయే ధాన్యాలుగానీ, పాత్రలుగానీ లేవు, కానీ ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి, గురుదేవులు సమయాసమయాలు లేకుండా తీసుకువచ్చే ఏ అతిధికైనా భోజనము పెట్టేవారు. ఆమె దగ్గర ద్రౌపది అక్షయ పాత్రలాంటిది ఏమైనా ఉందేమో! మాతాజీ వంటగది తెలిసినవారందరికి తెలుసు, అందులో గురుదేవులు పెళ్ళికానుకగా ఇచ్చిన ఇనుప తపాలా మాత్రమే ఉండేదని. అది మాతాజీ చివరివరకు తన దగ్గరే ఉంచుకున్నారు. ఒకసారి మాతాజీ, గురుదేవులు యఙ్ఞానికని భావనగర్ వెళ్ళారు. అక్కడ మధ్య తరగతి కుటుంబంలో భోజనాలు ఏర్పాటు చేశారు. వారింటిలో కేవలం ఏడు, ఎనిమిదిమందికి సరిపడు భోజనము మాత్రమే తయారు చేశారు. బయట యఙ్ఞస్థలిలో వందలాదిమంది ఉన్నారు. మాతాజీకి తన బిడ్డలు ఆకలితో ఉంటే తనకి భోజనము సహించదు, లోపల చూస్తే వందమందికి పెట్టేటంత ధాన్యం లేదు. మాతాజీ బయటకి వచ్చి గురువుగారితో, 'ముందు పిల్లలని తిననివ్వండి, ఆ తరువాత మనము తిందాము ' అన్నారు. మాతాజీ లొపలికి వెళ్ళి పొయ్యి వెలిగించి, ఇంటావిడని వంట ప్రారంభించమని సూచించారు. వందలాదిమంది భోజనాలయ్యాక కూడా ఇంకా ఏడు, ఎనిమిదిమందికి వండిన భోజనము అలానే వుంది. ఇలాంటి ఎన్నోఅద్భుతాలు మాతాజీ జీవితంలో జరిగాయి. ఇవన్నీ మాతాజీ రూపుదాల్చిన అన్నపూర్ణాదేవి అని నిరూపిస్తాయి.

'నారి శక్తి జాగరణ ' ఉద్యమానికి మాతాజీయే నడిమిస్తంభము.గురుదేవులు 21వ శతాబ్ధి 'నారీ శతాబ్ధి ' అని ఉద్ఘాటించారు. నారీ శక్తి మతాజీనుంచే ఆరంభమవుతుందని అన్నారు. అలాగే నిజంగా మాతాజీ జీవితము ఆ భవిష్యవాణికి ప్రత్యక్షంగా నిలిచింది. మాతాజీ యొక్క కరుణామయి అంతఃకరణ మహిళల నిస్సహాయతను బాగుగా అర్థము చేసుకుంది. ఇది ఆమె మహిళల ఉన్నతికి పాటుపడేలా ప్రేరేపించింది.

ఆమె కొంతమంది నిస్సహాయులకి ఆశ్రయమివ్వటము మొదలవ్వగానే ఈ సమస్య ఇంతటితో తీరదని, వారిలో ఆత్మబలము నింపాలని దానితోవారు జీవనపోరాటంలో పోరాడగలరని గ్రహించారు. దీనిని సాధించుటకు ఆడవారికి గాయత్రీ మంత్రము జపించే హక్కు ఇవ్వబడింది. మహిళలు గాయత్రీ మంత్ర దీక్ష తీసుకోవటమనే సాహసమును మాతాజీయే ప్రప్రధమముగా చేశారు. ఆ తరువాత అది దేశమంతటా చాలామంది మహిళలకి ఇవ్వబడింది. ఆ రోజులలో గాయత్రీ మంత్రము సవితోపాసన మంత్రముగా ఎన్నో పద్ధతులతో వాడుకలో ఉన్నప్పటికి కూడా, మాతాజీ, గురుదేవులు, మాతృశక్తి గౌరవము పెంచుటకొరకు గాయత్రీని నారీశక్తిగా ప్రవేశ పెట్టవలసి వచ్చింది. పురుష అహంకార సమాజములో ఇది ఏ మాత్రమూ తేలికైన పని కాదు. దీని కొరకు వారు ఎన్నో ప్రాణాపాయ బెదిరింపులను, ప్రతికూలతలను సమాజంలోని అన్ని వర్గాలవారి నుంచి ఎదుర్కొనవలసి వచ్చింది. కానీ ముక్తి పథంపై నడుచుచున్న ఈ యోధులు వాటికి సిద్ధపడే ఉన్నారు. గురుదేవుల ప్రకారము, శాంతికుంజ్ స్థాపించుటకు గల ముఖ్య ఉద్దేశ్యమేమిటంటే, మహిళ జాగరణకి ఒక ఉద్యమాన్ని మాతాజీ అనుశాసనంలో మొదలు పెట్టి దానిని విశ్వవ్యాప్తమైన ఉద్యమంగా చేయుట. శాంతికుంజ్లో చేపట్టిన మహిళోద్ధారణ ఉద్యమము పాశ్చాత్య దేశాలలో ప్రచారంలోనున్న దాని కంటే భిన్నమైనది. మాతాజీ ప్రకారము ఇది, నారి జాగరణ అనగా సంవేదనములను, భావనలను జాగృత పరచుట. దీని కోసమని స్త్రీ, పురుషునితో సమానత్వము కావాలని ఆశించక, తనలో స్వాభికంగానున్న మాతృతత్వాన్ని ప్రోదిచేయాలి. దీని కొరకు వారు


సాహిత్య ప్రచురణ చేయుట

మహిళలకు శిక్షణా శిబిరాలు నిర్వహించుట,

శక్తి యొక్క వ్యవస్థీకరణ,

సృజనాత్మక కార్యక్రమాలు చేపట్టుట చేశారు.

ఎంతో వినమ్రముగా మాతాజీ శాంతికుంజ్లో మొదలు పెట్టిన నారీ జాగరణోద్యమము పెరిగి పెద్దదై 21 శతాబ్ది - నారి శతాబ్ది అనే నినాదాన్ని నిరూపించింది.

TOP