డా.ఆర్.కె

శ్రీ మారెళ్ళ శ్రీ రామ కృష్ణ
జననము - అక్టొబర్ 14 – 1948 – June 30th 2014 – 24000 days.
ద్వాదశి తిధి, కుంభరాశి, శతభిషా నక్షత్రము, మచిలీపట్నము ఆంధ్రప్రదేశ్ భారతదేశము .
తల్లి తండ్రులు శ్రీమతి మారెళ్ళ సక్కుబాయి, శ్రీమారెళ్ళ కామరాజుగారు దంపతులు.
చదువు - డాక్టరేట్ ఇన్ కెమిష్ట్రీ Physical Chemistry , బెనారస్ హిందూ యూనివెర్సిటీ .

శ్రీ మారెళ్ళ శ్రీ రామ కృష్ణగారు ( 10/14/1948 – 30/06/2014) Professor in chemistry, వైజ్ఞానిక ఆధ్యాత్మికవేత్త , పండిత శ్రీ రామ శర్మ ఆచార్య గురుదేవుల ప్రజ్ఞా పుత్రులు, మిషన్ ఆర్ కె వ్యవస్థాపకులు, హోమియో వైద్య నిపుణులు, శ్రీ విద్యా పారంగతులు, అఖండ ప్రజ్ఞా ప్రవచన కర్త. ఆయనను అందరూ ప్రేమగా మష్టారూ అని సంబోధిస్తారు. తమ గురుదేవులకి తమ 24000 రోజుల జీవితాన్ని ఒక గాయత్రీ మహామంత్ర పురశ్చరణగా సమర్పించిన శ్రధ్ధాపుత్రులు.

బాల్యము - శ్రీ రామ కృష్ణగారి పితామహులు శ్రీ సోమేశ్వరరావుగారు, ఆయన శ్రీ రామ కృష్ణ పరమహంస భక్తులు. అందుకే ఆయన తన మనుమడికి ప్రేమతో శ్రీ రామ కృష్ణా అని పేరు పెట్టుకున్నారు. శ్రీ రామ కృష్ణ 7 సంవత్సరాల వయస్సులో ఉండగా సోమేశ్వరరావుగారు తమ అంతిమ సమయాన్ని కాశీలో గడపటానికి నిశ్చయించుకున్నారు. ఆయన వెడుతున్న సమయములో శ్రీ రామ కృష్ణగారు కూడా వారితో కలిసి కాశీకి వెడతానని మారాంచేసి బందరునుండి కాశీకి చేరారు. ఆయన శిక్షణలో ప్రతిరోజూ ఉదయమే కాశీ విశ్వేశ్వరునికి అభిషేకము చెయ్యటము, గీతా పారాయణము, విశ్వనాధుని ఉపాసన వారి నిత్య కర్మలు, అవే కాకుండా గంగానదిలో నీటిపై తేలుతూ సాధన చేస్కోవటము ఒక ఆటవలె నేర్చుకున్నారు. అక్కడే ఆయనకు అనేక గురువులతో అనుబంధము ఏర్పడింది. ప్రతిభావంతులైన, యోగ్యత కలిగిన శిష్యులకు గురువులు తామే వచ్చి ఆశీర్వదిస్తారు అనటానికి నిదర్శనంగా ఆయనకు 36 మంది గురువులతో అనుబంధము ఏర్పడింది, అందరు గురువులు స్వయముగా వారే వచ్చి శ్రీ రామ కృష్ణగారికి దీక్షలను ఇవ్వటము చూసిన తాతగారు చాలా ఆశ్చర్యపోయేవారు. స్వీకరించిన మంత్రాలను అత్యంత శ్రధ్ధతో ప్రతి గురువు చెప్పిన సాధనలను అత్యంత మెలుకువతో అతి తక్కువ సమయములో సాధించి చూపించేవారు శ్రీ రామకృష్ణులు. ఈ క్రమంలోనే శ్రీ ఆనందమయి మాత, గోపీనాధ్ కవిరాజ్, కీనారాం బాబా వంటి గురువులకు వీరు అత్యంత ప్రియ శిష్యులు అయ్యారు. అక్కడ ఆయన మంత్ర, తంత్ర & యంత్ర శాస్త్రాలను బాగా అధ్యయనము చేసారు. కాశీలోని విభిన్న గురువులవద్ద నేర్చుకున్న అధ్యాత్మిక సాధనలలోని వైవిధ్యము, గురువుల మధ్య ఉన్న సమన్వయానికి చిన్నతనములోనే బీజారోపణ జరిగింది, అదే పెరిగి పెద్దయ్యాక అఖండ గురుసత్తా అనే వృక్షమైంది. ఈ విధంగా శ్రీ రామకృష్ణగారి విధ్యాభ్యాసము, ఆధ్యాత్మిక సాధనలు కూడా కాశీలోనే కొనసాగాయి. తన చదువుతోపాటే ఆనందమయీఘాట్ కు వెళ్ళి పరిసరాలను శుభ్రపరచటము, సేవా కార్యక్రమాలకు తగిన సమయాన్ని ఇవ్వటము అలవాటు అయింది. ఆయన ఈ విధంగా తన విద్యాభాసాన్ని కొనసాగిస్తూనే బనారస్లోని Theosophical Society లో చేరి వారి గ్రంధాలయములోని పుస్తకములను అన్నీ చదివారు. స్వామీ వివేకానంద ఒక పుస్తకము చదివేసరికి మిగిలినవారు ఒక పేజీనే చదవగలుగుతారు అని ప్రతీతి, ఇదే రకమైన ప్రజ్ఞ మాష్టారి పుస్తక పఠనములో కనిపిస్తుంది. అన్ని అధ్యాత్మిక సంస్థలకు సంబంధించిన గ్రంధాలయములలోని పుస్తకములే కాక తెలుగు, హిందీ, ఇంగ్లీషు నవలలు బాగా చదివేవారు. ఆయన తమ జీవితములో చదివిన వేలాది పుస్తకములలో కొన్ని పుస్తకములను ఇప్పుడు శంబళ ద గ్లోబల్ పవర్ సెంటర్, హైదరాబాదులోని " శ్రీ మాత సక్కుబాయి విశ్వ ఆధ్యాత్మిక గ్రంధాలయము” నందు సందర్శించవచ్చు. ఆధ్యాత్మిక గురువులకు సంబంధించి ఆయన చదివిన పుస్తకాల వలన కానీ చేసిన సాధనలవలన కానీ ఆయనను వాకింగ్ ఎన్సైక్లోపీడియా అనవచ్చు. ఆనాటి థియోసాఫికల్ సొసైటీలో ఉన్నత సాధనలకు అనుమతిని కోరుతూ Geoffrey Hodson గారికి ఒక లేఖను రాసారు. దానితో పాటు థియోసాహికల్ సొసైటీలో ఎటువంటి దీక్షలను తీసుకొనకముందే తను స్వయముగా How to contact angels అనే articleను రాసి పంపగా అది చదివి Geoffrey Hodson గారు అత్యంత ఆనందముతో థియోసాఫికల్ సొసైటీవారికి టెలిగ్రాం ద్వారా శ్రీ రామ కృష్ణ్గారికి Theosophical society కి సంబంధించిన దీక్షలను ఇవ్వవలసిందిగా, శ్రీ రామకృష్ణగారి జ్ఞానాన్ని ప్రశంసిస్తూ తమ హర్షాన్ని వ్యక్తము చేసారు. Banaras Hindu University నందు Physical Chemistry లో డాక్టరేట్ పట్టాను పొందారు.


సద్గురు దర్శనము - పండిత శ్రీ రామ శర్మ ఆచార్య గురుదేవుల మార్గదర్శనము :

శ్రీ రామకృష్ణ పి.హెచ్ డి చేస్తున్న సమయములోనే ఆయనకు వరుసగా 3 సార్లు ఒకే మహాత్ముడు కలలో కనిపించి రామకృష్ణా నా దగ్గరకు రా అని పిలిచేవారు, కానీ ఆ మహానుభావులు ఎవరో శ్రీ రామకృష్ణగారికి తెలియలేదు, ఎప్పుడూ ఎక్కడా చూసినట్టు గుర్తు లేదు. ఒకరోజు బస్సులో యూనివర్సిటీకి వెళ్తుండగా ఒక వ్యక్తి చేతిలో నుండి పుస్తకము జారి క్రిందపడింది, శ్రీ రామకృష్ణగారు వంగి ఆ పుస్తకాని తీసి ఆ వ్యక్తి కి ఇస్తున్న తరుణములో ఆ పుస్తకము వెనకాల పేజీలోని వ్యక్తి మొఖము వారిని ఆకర్షించింది. ఈయనే కదా నా కలలోకి వచ్చి నన్ను రమ్మని పిలుస్తున్నారు అని గుర్తుపట్టి ఆ వ్యక్తిని కాసేపు ఆ పుస్తకము చూసేందుకు అనుమతిని అడిగి దానిని చదివారు. అది పరమపూజ్య గురుదేవులు పండిత శ్రీ రామశర్మగారు ప్రతి నెల వ్రాసి పంపే “అఖండజ్యోతి మాసపత్రిక”. అందులో గురుదేవులు మధురనుండి హరిద్వార్ కు వెళ్ళేందుకు తీసుకున్న నిర్ణయము ఈ లోపు 1971 జూన్ నెలలో ఇవ్వబోయే సామూహిక గాయత్రీ దీక్షా కార్యక్రమము, మరి ఇతర కార్యక్రమముల వివరాలు ఉన్నాయి. అది చదివిన మాష్టారు వెంటనే మధురకి వెళ్ళటానికి నిర్ణయించుకున్నారు. 1971 జూన్ 18 వ తేదీన వారు మొదటగా వారి ఆరాధ్యులు శ్రీ రామశర్మ ఆచార్య గురుదేవుల వద్ద గాయత్రీ మంత్రదీక్షను పొందారు. ఆ క్షణము నుండి తన ఆరాధ్యుని కార్యక్రమాలను కూడా తన జీవిత లక్ష్యములో చేర్చుకున్నారు.

సైంటిస్టు గా ఆయనకు ఉన్న ప్రయోగాత్మక దృష్టి ఆధ్యాత్మిక వైజ్ఞానికతను తెలియ చెప్పిన పండిత శ్రీరామశర్మ ఆచార్యగారివద్ద మరింత మెరుగులు దిద్దపడింది. అధ్యాత్మికత అనేది ఒక జీవించే కళ అని అధ్యాత్మిక జీవితవిధానము అనుసరించి మనిషిలోని దేవత్వాన్ని వికసింపచేసుకొనుట ప్రస్తుత మానవజాతి ఆవశ్యకత అనేది ఆయన తత్వము. పండిత శ్రీ రామశర్మ ఆచార్య గురుదేవులవద్ద గాయత్రీ మంత్ర దీక్ష తీసుకొని ప్రాణ ప్రత్యావర్తన శిబిరములో పాల్గొన్న తరువాత వారు తమ గురుదేవుల వద్దే ఉండి గురుసేవ చేస్కొనుటకు నిశ్చయించుకున్నారు. కానీ గురుదేవులు " బేటా నువ్వు ఆంధ్రప్రదేశ్ కు వెళ్ళు, నేను తిన్నదే నువ్వు తిను, నేను కట్టినదే నువ్వు కట్టు, నా పనిని నువ్వు దక్షిణ భారతదేశం నుండి విస్తరింపచెయ్యి " అని అజ్ఞాపించారు. గురుదేవుల ఆజ్ఞను శిరసావహించి వారు బెనారస్ లో పి.హెచ్ డి పూర్తిచేసుకున్న తరువాత ముందుగా ఆంధ్రప్రదేశ్లోని అనంతపురానికి 1975 ప్రాంతంలో వచ్చారు. ఆయన తన ఉద్యోగాన్వేషణలో గవర్నమెంటు లెక్షరరుగా పని చెయ్యటానికి ప్రయత్నాలు చేస్తూనే మొట్టమొదటిసారి గాయత్రీ పరివార్ కార్యక్రమాలను అంధ్రదేశములో అనంతపురములో గాయత్రీ మంత్రము, యజ్ఞము ప్రచారముతో మొదలుపెట్టారు. ఆయనకు అత్యంత ఇష్టమైన వైద్య సేవ హోమియో మందులను ఇస్తూ విషజ్వరాలను కూడా అత్యంత సునాయాసంగా తగ్గిస్తూ ప్రజలకు సేవ చేసారు. 1980 సంవత్సరములో ఆయనకు గుంటూరు టి.జె.పి.యస్. కళాశాలలో కెమిస్ట్రీ లెక్చరరుగా పదవి లభించింది, గుంటూరు లోని వేణుగోపాల్ నగర్లోని సుకృతా విల్లాలో నివసిస్తూ వారు తమ ఉద్యోగ బాధ్యతను, మిగిలిన సమయాన్ని గురుదేవుల కార్యక్రమాలకు వినియోగించేవారు. ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాలలో గాయత్రీ పరివార్ ను విస్తరింపచేసారు. తమ ఇంటినే తరువాతి కాలములో సప్తర్షి ఆశ్రమముగా మలచారు. ఆయన శిక్షణలో ఒకరికి మించిన కార్యకర్తలు ఒకరు తయారయ్యి వేగవంతముగా పనులు సాగేవి. శ్రీరామ శర్మ గురుదేవులు ప్రతి నెలా అఖండజ్యోతిద్వారా పరివారములోని సభ్యులు చెయ్యవలసిన కార్యక్రమాలను, సాధనలను, ఆశీస్సులను, తప:శక్తిని ప్రదానము చేసేవారు. ప్రతి నెలా వచ్చే అఖండజ్యోతి సాధనలను ఆ పుస్తకము చేతికి రాకముందే అవే విషయాలను ఆంధ్రప్రదేశ్ లోని కార్యకర్తలకు తెలియచేసి పనిని వేగవంతముగా ముందుకు తీస్కొనివెళ్ళేవారు, అంటే గురుదేవులు అఖండజ్యోతిని తయారుచేస్తుండగానే మౌనములో ఆ విషయాలను తెలుసుకుని ఆచరణలోకి తెచ్చేవారు. ప్రతి నెలా జరిగే ఈ ఆశ్చర్యజనక విషయాన్ని గురుంచి ప్రస్తావించినప్పుడు ఇది ప్రాణప్రత్యావర్తన శిబిరములో భాగము పొందుటవలన సాధ్యమైన విషయమని చెప్పేవారు. డా.ఆర్.కె కు అనేకమంది గురువులపై, వారి కార్యక్రమాలపై గల అద్భుతమైన అవగాహనవలన రకరకాల అధ్యాత్మిక సంస్థలవారు ఆయనను తమ సంస్థకు పిలిచి ఆ గురువు చెప్పిన సాధనలను, పుస్తకములపై వివరణలను ఇమ్మని కోరేవారు. అలా శ్రీ అరబిందో సొసైటి, థియోసాఫికల్ సొసైటి, శ్రి రమణాశ్రమము, శ్రీ సత్యసాయి , శ్రీ షిరిడీ సాయి ఇలా ఒకటేమిటి దక్షిణ భారతదేశములోని అత్యంత ప్రముఖ సంస్థలన్నింటిలో వీరికి ఒక ప్రత్యేక స్థానము ఉన్నది. ఆయన ప్రతి సంస్థను ముందుకు తీస్కొని వెళ్లేందుకు ఆ సంస్థవారు ఆచరించవలసిన విషయాలను అత్యంత ప్రేమతో తెలియచెప్పటమే కాకుండా తమ దగ్గరకు వచ్చినవారందరినీ ఏ గురువుకు సంబంధించినవారో గ్రహించి ఈ రోజునుండి నువ్వు ఫలానా సంస్థలో చేరి విద్య నేర్చుకొమ్మని, గురుసేవ చెయ్యమని చెప్పి పంపేవారు.


ఏకైక అఖండ గురుసత్తా ఆవశ్యకత - ఆవిష్కరణ :

పండిత శ్రీరామ శర్మ గురుదేవులు పంచవీరభద్ర సాధన తరువాత 2000 సంవత్సరములోపు జరగవలసిన మార్పులకోసము తనవంతు బాధ్యతగా అనేక ఆధ్యాత్మిక సంస్థలు కలిసిపని చెయ్యవలసిన ఆవశ్యకతను గుర్తించి 1996 వ సంవత్సరములో "ఏకైక అఖండ గురుసత్తా" ఆవిష్కరించారు. తమ గురుదేవులు కలగన్న " పృధ్విపై స్వర్గావతరణ" అన్ని ఆధ్యాత్మిక సంస్థలు కలిసి పనిచెయ్యటము ద్వారా సులభమవుతుందని, వారికి అనేక ఆధ్యాత్మిక సంస్థలతో ఉన్న అవగాహన ద్వారా ఆ గురువుల మధ్య ఉన్న " ఏక సూత్రాన్ని" అందరికీ తెలియచెప్పి కలిసి పని చేసేందుకు పిలుపునిచ్చారు. "అఖండ మండలాకారము వ్యాప్తం ఏన చరాచరం" అనగా సర్వత్రా వ్యాపించి ఉన్న, సకల జీవరాశులలో ఉన్న గురు తత్వము" - అ ఏకైక గురుతత్వాన్ని పట్టుకొని " మనిషిలోని దైవత్వాన్ని జాగృతపరచుకొవాలని తెలియచెప్పటానికి 1996 నుండి 2000 సంవత్సరమువరకు నిద్రాహారాలు మాని ఊరూరా తిరిగి అహర్నిశలు పనిచేసారు. ఈ 5 సంవత్సరములలో ఆయన నిర్వహించిన సాధనా శిబిరములు, యజ్ఞములు, అఖండ జపములు చేయించిన విధానము న భూతో న భవిష్యతి అని అనవచ్చు, ఆయన యొక్క త్యాగనిరతకు ప్రభావితమై ఈ సంస్థలో పని చేసేందుకు ఎంతో మంది పరివార సభ్యులు తమ ఇళ్ళు ఉద్యోగాలు వదిలి వచ్చి ఆయనతో కలిసి పనిచేసారు. మొదటినుండి హిందీలో ఉన్న గురుదేవుల క్రాంతిమయ సాహిత్యాన్ని తెలుగులోకి అనువదిస్తున్నప్పటికీ 2000 నుండి 2004 వరకు ఎక్కువ సమయాన్ని సాహిత్య అనువాదమునకు వినియోగించి అప్పటివరకు ఏర్పరిచిన కార్యకర్తల దిశానిర్దేశానికి సహాయపడ్డారు. 2002 లో తమ పూర్తి సమయాన్ని విశ్వ శ్రేయస్సుకు వినియోగించేందుకుగాను తన పదవీ విరమణ చేసారు. 2014లోపు తమ గురుదేవులు వ్రాసిన అన్ని హిందీ వాఙ్యయములకు కొన్నిటికి సంక్షిప్త సారాన్ని, మరి కొన్నిటిని పూర్తిగా తెలుగులోకి అనువాదములను పూర్తిచేసారు. అంతే కాదు 24 గాయత్రీ మంత్రాక్షరాలకు ఒక్కో అక్షరానికి ఒక్కో పుస్తకముగా “ఎలీసా బెయిలీగారు” రాసిన న్యూ ఏజ్ ఎడ్యుకేషన్ - నూతన యుగాన్ని ఆవిష్కరించటానికి వ్రాసిన పుస్తములన్నింటికి, పండిత శ్రీ రామ శర్మ ఆచార్య గురుదేవుల సాహిత్యానికి మధ్య సమన్వయాన్నివారి ప్రణాళికలను అనుసంధానము చేస్తూ Master.R.K 24 పుస్తములను వివరించారు.


మిషన్ ఆర్ కె సంస్థ ప్రారంభము:

2004 , 2005 సంవత్సరములలో పృధ్విపై జరగనున్న ప్రకృతి ఉపద్రవాలను ఎదుర్కొనుటకై, తద్వారా జగరబోయే ప్రాణనష్ట నివారణార్ధం, ప్రకృతిసహజమైన ఆస్థుల నష్టాలనుండి పృధ్వీమాత కోలుకునేందుకు గాను " శ్రీ మహాలక్ష్మీ యజ్ఞములు, అఖండ భాగవత పారాయణలు, అఖండ గాయత్రీ జపములు, విశ్వఏకీకరణ యజ్ఞములు, గోమాత సాధనలు చేయించారు. అదే సమయములో కార్యక్రమాల వైవిద్యత వలన సంస్థలో వస్తున్న తీవ్ర ఇబ్బందులనుండి బయటపడటానికి " మిషన్ ఆర్.కె" అను సంస్థ పేరుతో భావి కార్యక్రమాలను ముందుకు తీస్కొని వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. 2004 కృష్ఠాష్ఠమినాడు " మిషన్ ఆర్ కె" సంస్థకు శ్రీకారము చుట్టారు. మిషన్ ఆర్ కె లక్ష్యము - అందరు గురువులు కలగన్న "1. " వసుధైక కుటుంబకము". పరమ పూజ్య గురుదేవులు పండిత శ్రీ రామ శర్మ ఆచార్యగారి కల నిజమగుట 2. " పృధ్విపై స్వర్గావతరణ, మనిషిలో దైవత్వ వికాసము".3. ఒకే భాష ( మౌన ప్రేమ), ఒకే ధర్మము - మానవునిలో దైవత్వ వికసనము, ఒకే విశ్వము - పృధ్విపై ఉన్న సకల ప్రాణికోటి యందు సోదర భావము, ప్రకృతివనరులను, మానవ వనరులను సంయమముతో కలిసి ఉపయోగించుకొనుట. అందరికీ శాంతి, సుఖము సమృధ్ధి.


ఆధ్యాత్మిక విద్యపై ఆయనకు గల విలక్షణ దృష్టి కోణము :

1. వైజ్ఞానికి శాస్త్రవేత్తలు ఒక శాస్త్రవేత్త ఒకసారి కనుగొన్న విషయాన్ని మరొక శాస్త్రవేత్త కనుగొనరు, దాని తరువాతి ప్రయోగాన్ని కానీ అదే ప్రయోగముయొక్క మిగిలిన భాగాన్నికానీ పూర్తి చేసే ప్రయత్నము చేస్తారు. మరి అటువంటిది అత్యున్నత స్థాయికి చెందిన అధ్యాత్మిక గురువులు ఒకే ప్రయోగాన్ని మరల చెయ్యరు అను సిధ్ధాంతాన్ని వెలుగులోకి తెచ్చారు.ఒక్కో గురువు ఒక్కో విద్యలో తమ ఆధిపత్యాన్ని కలిగి ఉంటారు, తెలుసుకొన దలచినవారు గురువులు సశరీరధారులుగా ఉన్నప్పుడు వారినుండి కానీ వారి తదనంతరము వారి సాహిత్యము, ప్రవచనములు, ఆశ్రమములలో సేవ ద్వారా కానీ వారిచ్చిన జ్ఞానాన్ని తెలుసుకోగలరు. అధ్యాత్మికతలోని కొన్ని విషయాలు మాత్రమే అందరు గురువుల వద్ద ఒకే విధముగా ఉంటాయి, కానీ వారి ప్రత్యేకత ఏమిటో తెలుసుకొని నేర్చుకొనుట విద్యార్ధుల లక్ష్యము కావాలి. పండిత శ్రీ రామ శర్మ ఆచార్య గురుదేవులు 18 మంది ఋషులను, వారి పరంపరలను తిరిగి పునర్జీవింపచేసినట్లుగానే శ్రీ రామ కృష్ణగారు 14 మంది గురువుల సమూహాన్ని ఎన్నుకొని వారి ద్వారా సమస్త గురు సాంప్రదాయాలను పునర్జీవింపచేసారు.

ఉదాహరణకు : శ్రీ రామ శర్మ ఆచార్యగురుదేవులు - మాతా భగవతీదేవీ శర్మ : గాయత్రీ మంత్రాన్ని, యజ్ఞాని సమస్త మానవజాతికి అందించటానికి తగిన తపస్సు చేసి - ఒకప్పుడు గాయత్రీ మంత్రము కేవలము ఒక జాతి, మతము కులమువారికే పరిమితమై ఉండేది, ఆ పరిధినుండి ఆ శక్తిని బయటికి తెచ్చి గాయత్రీ మంత్రాన్ని సార్వజనీనము చేసారు.

శ్రీ అరవిందులవారు - మాతా మిర్ర: తమ తప: శక్తిని సావిత్రీ శక్తిని, అమరత్వ విద్యను భారత దేశమునుండి భూమిపై కల సమస్త మానవులకు అందించేందుకు సావిత్రీ అనే అద్భుత రచన ద్వారా “ Supra mental descent” అందించారు. ఇంతకు ముందు అమరత్వము కేవలము అధికమైన తపస్సు ద్వారా అతి తక్కువమందికి మాత్రమే సాధనా యోగ్యముగా ఉండేది.

మాతా బ్లావెట్స్కీ - ధియోసాఫికల్ సొసైటి ద్వారా విశ్వ ప్రణాళికలో మానవులు ఎక్కడ ఉన్నారు, వారి లక్ష్యము ఏమిటి, పంచకోశములను వైజ్ఞానికి పధ్ధతిలో ఎలా అర్ధము చేసుకోవాలో తెలియచేసారు.

మాష్టర్ సి.వి.వి భృక్తరహిత తారక రాజయోగముద్వారా సాధకుడు బ్రహ్మ జ్ఞానాన్ని అతి సునాయాసముగా సాధించేవిధానాన్ని, కర్మలను మార్చుకోగలిగే విద్యను, కుండలినీ విద్యను బోధించారు.

శ్రీ శ్యామ చరణ లాహిరీ మహాశయ - శ్రీ పరమహంస యోగానందులవారు- క్రియా యోగము ద్వారా మానవుడు పరిణామ క్రమములో అత్యంత వేగవంతముగా ముందుకు వెళ్ళచ్చు అని నిరూపించారు.

షిరిడీ సాయి-సత్యసాయి: అగ్ని విద్యద్వారా మానవుల చేతనత్వాన్ని మారుస్తూ శ్రధ్ధ - సబూరీలతో ఆత్మజ్ఞానాన్ని అందించారు. సత్యం ధర్మము ప్రేమ న్యాయము అను నాలుగు స్తంభాలను భజన, సేవ మార్గములద్వారా ఆచరణలోకి తెచ్చారు.

శ్రీ రామ కృష్ణ ప్రమహంస - శారదా మాత: ఒకసారి కాళీ దర్శనము జరిగాక ఒక్కో దైవీ శక్తిని కేవలము మూడు రోజులలో సాధించి, ఆ దేవతా శక్తులన్నింటిని పునర్ జాగృతము చేసారు.

శ్రీ రమణ మహర్షి - జిళ్ళెళ్ళమూడి అమ్మ: నేనెవరు అనే ప్రశ్న సమధానాన్ని పొందటానికి అత్యంత తేలికైన మర్గాన్ని అందించారు, ఆహారము ద్వారా కర్మలను ఎలా మార్చుకోవచ్చో జిళ్ళెళ్ళమూడి అమ్మ తెలియచెప్పారు.

ఇలా చెప్పుకుంటూ పోతే భారతదేశములోని గురువుల ఒక్కో జీవిత చరిత్ర ఒక్కో కొత్త ఆధ్యాత్మిక సాధనను ఆవిష్కరించింది.


2. వైజ్ఞానిక శాస్త్రవేత్తలు అంతా కలిసి ఒక విషయాన్ని పూర్తిగా అవగాహన చేసుకుని అంతిమ విజయాన్ని సాధించటానికి సహాయ సహకారములు, జ్ఞానము ఒకరితో ఒకరు పంచుకొన్నట్లుగానే అధ్యాత్మిక క్షేత్రంలోని రకరకాల గురువుల శిష్యులు ఒకరితో ఒకరు జ్ఞానాన్ని సాధనా రహస్యాలను పంచుకొని సాధనలో విజయాన్ని సాధించాలి.( పరమ గురువుల ప్రణాళికలో భాగముగానే ప్రస్తుత కాలములో కమ్యూనికేషన్ వ్యవస్థ అతి తీవ్రవేగముతో అభివృధ్ధిచెందుతున్నది, వీటిని ఉపయోగించుకొని మనుషులు సామూహికముగా అతి తీవ్రగతిలో అధ్యాత్మిక అభివృధ్ధి సాధించవచ్చు.)

“ మానవులలోని మానవత్వాన్నే కాక, దైవీ గుణాలను వెలికి తీసి వారి చేతనత్వాన్ని దైవీ చేతనత్వంగా మార్చుకోవటమే లక్ష్యముగా గల, పృధ్విపై స్వర్గీయ వాతావరణాన్ని, మానవులలో దైవత్వ వికాసాన్ని సాధించదలచుకున్న అన్ని సంస్థలు కలిసి పని చెయ్యాలి” అనే సంకల్పముతో వారు 2004 లో మిషన్ ఆర్ కె అనే సంస్థగా అనేకమంది సాధకులను ఆశ్రమాలను అభివృధ్ధి చేసినప్పటికి తాను చెప్పిన విషయాన్ని తానే పాటించి చూపించాలని తన మిషన్ ఆర్ కె అనే సంస్థను తన ఆరాధ్యులు పండిత శ్రీ రామశర్మ ఆచార్యగారి గాయత్రీ పరివారములో తిరిగి 2008లో విలీనము చేసి "వ్యక్తిగత ఉద్దేశ్యముల పూర్తికంటే సామూహిక ప్రయత్నమే గొప్పది" అని పాటించి చూపించిన ఆదర్శ మూర్తి. వేలాదిమందిని తన ఆశ్రమాలను తన గురువుకి అంకితంచేసి 2011లో పండిత శ్రీ రామ శర్మ ఆచార్య గురుదేవుల శతాభ్ది సమారోహమునకుగాను ఆయన దేశ విదేశాలలో తిరిగి తమ గురుదేవుల అధ్యాత్మిక విద్యను ఎంతోమంది కొత్త వ్యక్తులకు తెలియచెప్పారు.


డాక్టర్ ఆర్ కె ఆవిష్కరణలు :

ధ్యానము : సమర్ధ సద్గురు స్పర్శ ధ్యానము

మంత్ర ద్రష్ట : అనుగ్రహ మాలా మంత్రము, శ్రీ దత్త శరణాగతి మంత్రము

దర్శించిన దేవత: శ్రీ మహా యోగేశ్వరీ దేవి, భూమిని వాహనముగా కలిగి 7 శిరస్సులు, 14 భుజములు కల్గిన యోగమాయ సర్వలోకేశ్వరీదేవి.

యంత్రము: మహాకాల చక్రవర్తీ యంత్రము

యజ్ఞము: విశ్వఏకీకరణ యజ్ఞము, మహా కాల యజ్ఞము- అంతర్యాగ సాధన.

దత్త ప్రదక్షిణలు వీరి ప్రత్యేకత.

కుండలినీ యోగ సూత్రములు - తమ గురుదేవుల చరిత్రను ఆధారముగా చేసుకొని 108 నామాలను కుండలినీ యోగసూత్రములుగా అందించారు.


కొన్ని వేల లక్షల శ్రీ మహా లక్ష్మీ యజ్ఞాలు, గాయత్రీ యజ్ఞములు, ద్వాదశరాశి నవగ్రహ అష్టోత్తర శత నక్షత్రపాద మహాకాల యజ్ఞములు, 40 రోజులపాటు సత్రయాగాన్ని చేయించారు. పలు రకాల మంత్రముల, బీజాక్షరముల అఖండ జపములు, అఖండ భాగవత, గీతా, గురుచరిత్ర పారాయణలు మరియు కోట్ల సంఖ్యలో మంత్రలేఖనములు వీరి మార్గదర్శనములో జరిగాయి.

ఆయన నిర్వహించిన సాధనా శిబిరములు, చెప్పిన ప్రవచనాలను వేల సంఖ్యలో ఆడియోలు, వీడియోలు మిషన్ ఆర్ కె వెబ్ సైట్ missionrk.com - నందు చూడవచ్చు. వారి ప్రవచనాలు పుస్తకాల రూపములో వెయ్యికి పైగా ఉండగా అయన స్వయముగా రాసిన పుస్తకములను కూడా వెబ్ సైట్ నందు చూడవచ్చు.


వీరు ఏర్పరచిన ఆశ్రమములు:

1. స్మర్తుగామి దత్తక్షేత్రము - కాకివాయి - నెల్లూరు

2. సప్తర్షి ఆశ్రమము - గుంటూరు

3. శ్రీ హంసరామ సహ్యాద్రి ఆశ్రమము- ఓడరేవు (చీరాల)

4. శ్రీ అగస్త్యాశ్రమము - రేపల్లె గుంటూరు జిల్లా

5. శంబళ – The global power center - హైదరాబాదు.

6. అష్ట సిధ్ధి నవనిధి గాయత్రీ శక్తి పీఠము - లక్ష్మీ పురము

7. శ్రీ గాయత్రీ అనుగ్రహ పీఠము – ఒంగోలు


ఆశ్రమాలను ఏర్పరిచినప్పుడు ఆ ఆశ్రమాన్ని ఏ ఉద్దేశ్యముతో స్థాపించారు? లక్ష్యము ఏమిటి అని చెప్పి, తమ తీవ్ర కృషి తప:శక్తితో ఆశ్రమానికి ఒక రూపు రేఖను ఇచ్చిన తరువాత దాని వ్యవస్థ బాధ్యతను స్వీకరించినవారికి సర్వ హక్కులను ఇచ్చి ఆ అశ్రమాలకు అవసరమైనప్పుడు తమ సహాయాన్ని అందించటము తప్ప ఏ ఆశ్రమాన్ని తన సొంత ఆశ్రమముగా స్వీకరించని నిజమైన నిస్సంగిగా జీవించారు.


Dr.R.K అంతిమ సందేశము :

మానవజాతి లక్ష్యము : ప్రస్తుత కాలములో 2100 సంవత్సరములోపు మొత్తము మానవజాతి 3 డైమెన్షన్ ప్రపంచమునుండి 4 డైమెన్షన్లోకి ప్రవేశించగలగాలి. ఇది సవితా ధ్యానము & గాయత్రీ మంత్రము వలన అత్యంత సునాయాసముగా సాధించవచ్చు.


పండిత శ్రీ రామ శర్మ గురుదేవులు తమ తప: శక్తి ద్వారా మానవత్వాని బీజరూపంలో అంతరిక్షమునందు భద్రపరచారు. కానీ మానవజాతి తన పోకడను మార్చుకోకపోతే భూమిపై వారి మనుగడ ప్రశ్నార్ధకముగా మారే పరిస్ధితులు ఉన్నాయి. పృధ్విపై స్వర్గావతరణలో భాగముగా ప్రస్తుతపు విద్యా విధనములోను, బ్యాంకింగ్ వ్యవస్థలోనూ, వైద్య విధానములోను అనూహ్యమైన మార్పులు వస్తాయి. విద్యా విధానములో చేతనత్వ విజ్ఞానము ప్రముఖపాత్ర వహిస్తుంది. పెరిగిన కమ్యూనికేషన్ వ్యవస్థ వలన బ్యాంకింగ్ మరియు వైద్య రంగాలూ పూర్తిగా ఉన్నత స్ధితికి తగిన విధముగా పరిణితి చెందుతాయి.


మానవులు ప్రతి రోజూ కొంత సమయాన్ని తమ చేతనత్వాని వికసింపచేసుకునేందుకు కేటాయించుకొనుట తప్పనిసరి. ప్రతి మానవునిలోని మానవత్వము జాగృతమైతే కానీ ప్రస్తుతము ఎదుర్కొంటున్న సమస్యలనుండి మానవజాతి బయటపడలేదు, మానవులు దేవ మానవులుగా మారటము వారి తక్షణ కర్తవ్యము.

వసుధైక కుటుంబకము, పృధ్విపై స్వర్గావతరణ అను తమ గురుదేవుల కలే తమ కల.


తన పరిజనుల బాధలను, కర్మలను నివారించేందుకు ప్రతి గురువు వలెనే మాష్టారు కూడా ఎంతో వ్యధను, శారీరక బాధలను అనుభవించారు. Dr.R.K అనారోగ్యము ఆయన్ను ఎప్పుడూ పన్లు చెయ్యనివ్వకుండా ఆపలేకపోయింది. తాను శరీరమును విడిచేందుకు నిర్ణయించుకున్న విషయాన్ని 3 ఏళ్ళు ముందునుండి సూచించారు, తన శరీరమును విడవటానికి ముందురోజువరకు శంబళ ద గ్లోబల్ పవర్ సెంటర్నందు ఆశ్రమములో చెయ్యవలసిన భావి కార్యక్రమములపై 72 గంటలపాటు నిరవధికముగా అక్కడి కార్యకర్తలకు సూచనలను అందచేసిన సిధ్ధ పురుషులు. తన గురు సేవలో భక్తి యోగాన్ని, సకల గురుప్రణాళికలను మానవజాతికి తిరిగి అందచేసినప్పుడు జ్ఞానయోగాన్ని, తన చివరి శ్వాసవరకు పని చేసి కర్మయోగాన్ని ఆచరించిన యోగవిద్యా నిపుణులు, అమృతమూర్తి, ప్రేమ మూర్తి మాష్టర్ ఆర్.కె.

TOP